ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జాతకం మార్చడానికి ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే కోచ్‌గా కిర్‌స్టన్‌ను నియమించిన యాజమాన్యం.. తాజాగా కెప్టెన్‌గా కోహ్లీని తప్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కోహ్లీ స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించాలని ఆర్‌సీబీ యాజమాన్యం భావిస్తోంది. కాగా గత 11 ఏళ్లుగా ఆర్‌సీబీ జట్టు తరఫున ఆడుతున్న విరాట్.. ప్రస్తుతం ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్నాడు. 2013 నుండి ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఒక్కసారి కూడా జట్టుకు టైటిల్ అందించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఐదు నెలల కిందట ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే, ఆ తర్వాత తాను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయంపై స్పష్టతనివ్వలేదు. కొన్ని రోజుల క్రితం డివిలియర్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను ఆడాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో డివిలియర్స్ 2011 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లీ తర్వాత డివిలియర్స్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సదరు జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.


కోచ్‌గా ఆశిష్ నెహ్రా


టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా..  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచింగ్ బృందంలో చేరాడు. గతేడాది బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న నెహ్రా పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించనున్నట్లు ఆర్‌సీబీ అధికారికంగా పేర్కొంది. చీఫ్ కోచ్, మోంటార్ గ్యారీ కిర్‌స్టెన్‌తో నెహ్రా పని చేయనున్నారని తెలిపింది.