టెన్నిస్ స్టార్ ఫెదరర్ ఖాతాలో మరో టైటిల్
షాంఘై మాస్టర్ టైటిల్ రోజర్ ఫెదరర్ సొంతమైంది. రఫెల్ నాదల్‌తో జరిగిన ఫైనల్‌లో ఫెదరర్ (6-4, 6-3) పాయింట్లతో తన చిరకాల ప్రత్యర్థిని ఓడించి మళ్ళీ టెన్నిస్ రారాజు అనిపించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి ఒకసారి కూడా ఫెదరర్ నాదల్ చేతిలో ఓడిపోవడం జరగలేదు. ఆఖరికి ఆస్ట్రేలియా ఓపెన్, మియామి మాస్టర్స్ మరియు ఇండియన్ వెల్స్ మ్యాచ్‌లలో కూడా ఫైనల్స్‌లో నాదల్ ఆశలను అడియాసలు చేస్తూ, రికార్డు స్థాయిలో విజయాలను నమోదు చేశాడు ఫెదరర్. అదే విజయస్ఫూర్తిని మళ్లీ ఈ మ్యాచ్‌లో కూడా చూపించాడు ఈ స్విస్ ఆటగాడు.
ఇప్పటికి 19 సార్లు గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ఈ టెన్నిస్ దిగ్గజం మాట్లాడుతూ, ఇంకా సాధించాల్సింది చాలానే ఉందని అన్నాడు. అయితే ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఇంకా నాదల్ నెంబర్ 1 స్థానంలో కొనసాగడం విశేషం. ఫెదరర్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.