గేల్ దెబ్బకి సన్ రైజర్స్ విలవిల..!
ఐపీఎల్-11 సీజనులో క్రిస్ గేల్ రెచ్చిపోయాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పొందిన తొలి ఓటమికి కారకుడయ్యారు.
ఐపీఎల్-11 సీజనులో క్రిస్ గేల్ రెచ్చిపోయాడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పొందిన తొలి ఓటమికి కారకుడయ్యాడు. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన హోరా హోరీ పోరులో సన్‌రైజర్స్ జట్టు కేవలం 15 పరుగుల తేడాతో ఓటమిని ఎదర్కోవలసి వచ్చింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 194 పరుగుల టార్గెట్ అందివ్వగా.. సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 178 పరుగులు చేసింది.
ఆ జట్టు అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. మనీశ్ పాండే (57 నాటౌట్; 42 బంతుల్లో 3×4, 1×6), విలియమ్సన్ (54; 41బంతుల్లో, 3×4, 2×6), షకిబ్ అల్ హసన్(24 నాటౌట్; 12 బంతుల్లో, 1×4, 2×6) బాగానే జట్టును కాపాడడానికి ప్రయత్నించినా.. పంజాబ్ బౌలర్ల తాకిడికి నిలవలేకపోయారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ రిటైర్డు హర్ట్‌గా వెనుదిరగడం ఈ జట్టుకి పెద్ద మైనస్ పాయింట్‌గా నిలచింది. మరో కీలక ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా ఆరు పరుగులకే ఔట్ అవ్వడంతో... తర్వాత వచ్చిన వారికి మ్యాచ్ గెలవడం కష్టమైంది. పంజాబ్ బౌలర్లలో మోహిత్, ఆండ్రూ టై చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
ఇక పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వస్తే క్రిస్ గేల్ (104 నాటౌట్; 63బంతుల్లో, 1×4, 11×6) విధ్వంసకారిగా చెలరేగాడు. సెంచరీతో మైదానంలో అభిమానులను ఉరకలెత్తించాడు. గేల్ ఔట్ అవ్వకుండా చివరి వరకూ గేమ్‌లో ఉండడం అనేది ఈ ఆటలో హైలెట్. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు అని చెప్పుకోవచ్చు.