Suryakumar Yadav T20 World Cup Records: ప్రస్తుతం భారత జట్టులో ఎవరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారంటే.. ప్రతి క్రీడాభిమానికి వెంటనే గుర్తొచ్చే పేరు 'సూర్యకుమార్ యాదవ్'. టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి పరుగుల వరద పారిస్తున్న సూర్య.. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నంగా మారాడు. సూర్య క్రీజులో ఉంటే.. బంతులు వేయడానికి బౌలర్లు భయపడుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయయోక్తి లేదు. ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న మిస్టర్ 360 సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐదు మ్యాచుల్లో 225 పరుగులు:
మిడిలార్డర్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఏడాది కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ పరుగులు చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. చూస్తుండగానే.. హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. దాంతో టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో 75 సగటుతో 225 పరుగులు చేశాడు. 246 పరుగులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 


వెయ్యికి పైగా పరుగులు:
సూపర్‌ 12లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సూర్య.. ఓవరాల్‌గా 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే సూర్య ఒకేపలు రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో ఒక ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు (1002) చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  సూర్య కన్నా ముందు పాకిస్తాన్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్ ఈ ఫీట్ అందుకున్నాడు. 2021 క్యాలెండర్ ఇయర్‌లో రిజ్వాన్ 1326 పరుగులు చేశాడు.


తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీ:
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలిచాడు. సూర్య 23 బంతుల్లో ఫిప్టీ బాదగా.. యువరాజ్‌ సింగ్‌ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో ఉన్నాడు. 2007లో యువీ ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2021లో స్కాట్లాండ్‌పై కేఎల్‌ రాహుల్‌ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 2007లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో యువరాజ్ హాఫ్‌ సెంచరీ సాధించగా.. తాజాగా సూర్య 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 


చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు: 
టీ20 క్రికెట్‌లో భారత్ తరపున చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆసియాకప్‌ 2022లో ఆఫ్గన్‌పై విరాట్ కోహ్లీ 63 పరుగులు చేయగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ సింగ్‌ 58 పరుగులు రాబట్టాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో జింబాబ్వేపై సూర్యకుమార్‌ 56 పరుగులు రాబట్టుకున్నాడు.


అత్యధిక స్ట్రైక్‌రేట్‌:
టీ20 ప్రపంచకప్‌లో 100 కంటే ఎక్కువ బంతులాడి.. అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. తాజా ప్రపంచకప్‌లో సూర్య 193.96 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 2010లో మైక్‌ హస్సీ 175.70 స్ట్రైక్‌రేట్‌తో, 2012లో లూక్‌ రైట్‌ 169.29 స్ట్రైక్‌రేట్‌తో, 2022లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 163.86 స్ట్రైక్‌రేట్‌తో, 2007లో కెవిన్‌ పీటర్సన్‌ 161.81 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశారు.


Also Read: Virat Kohli: ఆ లక్షణాలే.. విరాట్‌ కోహ్లీ సక్సెస్‌కు కారణం: శిఖర్‌ ధావన్‌


Also Read: వెరైటీ డ్రెస్‌లో వ‌య్యారాలు ఒలికిస్తున్న ఐశ్వర్య లక్ష్మి.. అచ్చు పాలరాతి బొమ్మలా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి