టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీనటి అనుష్క శర్మల వివాహం జరిగి నాలుగు నెలలు అవుతున్న క్రమంలో ఈ జంట కొత్త కాపురానికి రంగం సిద్ధం చేసుకుంది. అందుకోసం ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన వర్లీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది ఈ జంట. అయితే ఆ ఇంటిలో వారు తాత్కాలికంగానే ఉండబోతున్నారని సమాచారం. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో పేరున్న రహేజా లెజెండ్స్ వారి అపార్టుమెంట్‌ను ఈ జంట అద్దెకు తీసుకోవడం గమనార్హం. 24 నెలలు ఆ ఇంటిలో ఉండేందుకు ఇటీవలే కోహ్లీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. 


ఆ అగ్రిమెంటులో భాగంగా రూ.1.50 కోట్లను డిపాజిట్ చేయడంతో పాటు.. రూ.1.01 కోట్లను రిజిస్ట్రేషన్ ఖర్చులుగా చెల్లించారు కోహ్లీ. అలాగే ఈ ఇంటికి నెలవారీ అద్దెగా రూ.15 లక్షల రూపాయలను చెల్లించనున్నట్లు సమాచారం. అయితే వర్లీ ప్రాంతంలో ఇప్పటికే కోహ్లీ ఓ ఫ్లాట్‌ను రూ.34 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని సమాచారం. అయితే సొంత ఫ్లాట్ ఉండగా.. మళ్లీ అద్దె ఇంటిలో ఉండాల్సిన అవసరమేముందని పలువురు అంటున్నారు. కాగా ప్రైవసీ నిమిత్తమే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది.