మాజీ కెప్టెన్ గంగూలీ కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా కష్టాలు అనుభవించాడట. ఇందుకు కారణం తాను ఏరికోరి తెచ్చుకున్న టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్ అని చెప్పాడు. 'నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే. సన్నిహితులు, మిత్రులు వద్దని వారించినా.. valla వినలేదు. కోచ్‌ గా చాపెల్ ను తెచ్చిపెట్టుకున్నాను. అందుకు నాకు తగిన శాస్తి జరిగింది’ అని పశ్చాత్తాపపడ్డాడు. 


తన ఆత్మ కథ ‘ఎ సెంచురీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ పుస్తకంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. '2004లో జాన్‌ రైట్‌ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు నా మదిలో తట్టిన తొలి పేరు గ్రెగ్‌ చాపెల్‌. అతడే మనల్ని నంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్తాడని భావించాను. ఇదే విషయాన్ని అప్పటి అధ్యక్షుడు దాల్మియాకు చెప్పాను. గవాస్కర్‌ లాంటి వాళ్లు వద్దని చెప్పారు. అతనితో ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఆఖరికి గ్రెగ్‌ సోదరుడు ఇ యాన్‌ చాపెల్‌ కూడా వద్దని చెప్పినా నేను వినలేదు. అప్పుడు నాకు అనిపించిందే చేశాను. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అతని వల్ల నా కెరీర్‌ సర్వ నాశనం అయింది. 2005 నా జీవితంలోనే అత్యంత గడ్డుకాలం. ఎలాంటి కారణం లేకుండా నా కెప్టెన్సీ కోల్పోయాను. ప్లేయర్‌ గానూ చోటు సంపాదించలేకపోయాను. ఇది రాసేటప్పుడు కూడా నాకు కోపం వస్తున్నది. నాకు జరిగిన అన్యాయం  ఊహించలేనిది, క్షమించలేనిది' అని గంగూలీ పుస్తకంలో రాశారు.