Umesh Yadav Cheated By His Friend: టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయాడు. ఉమేష్ యాదవ్ ని మోసం చేసింది మరెవరో కాదు.. స్వయంగా అతడి బిజినెస్ వ్యవహారాలు చూసే మేనేజర్ అయిన స్నేహితుడే. అవును మీరు చదివింది నిజమే. ఉమేష్ యాదవ్ స్నేహితుడి చేతిలో మోసపోయాడు. శైలేష్ థాకరే వ్యక్తి ఉమేష్ యాదవ్ కి స్నేహితుడు. శైలేష్ థాకరే ఉద్యోగం లేదని బాధపడుతుండటంతో అతడిని ఉమేష్ యాదవ్ తన మేనేజర్ గా నియమించుకుని తన వద్దే పని కల్పించాడు. 2014 లో ఉమేష్ యాదవ్ టీమిండియాలోకి సెలెక్ట్ అవగా.. అదే ఏడాది జులై 15న శైలేష్ థాకరేను ఉమేష్ యాదవ్ తన మేనేజర్ గా నియమించుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా సెలబ్రిటీల మేనేజర్సే వారి బిజినెస్, ఎండార్స్‌మెంట్స్ డీల్స్ చూస్తుంటారు కనుక ఉమేష్ యాదవ్ కూడా తన బిజినెస్ వ్యవహారాలు చూసుకునే బాధ్యతలను మేనేజర్ గా శైలేష్ థాకరేకే అప్పగించాడు. శైలేష్ థాకరే నమ్మకంగా పనిచేస్తుండటంతో తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు చూసే బాధ్యతలను కూడా అతడికే అప్పగించాడు. ఈ క్రమంలోనే నాగపూర్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించిన ఉమేష్ యాదవ్.. ఆ పని చేసి పెట్టాల్సిందిగా శైలేష్ థాకరేకు చెప్పాడు. అయితే, ఉమేష్ యాదవ్‌‌కి తక్కువ ధరలో ఒక ఫ్లాట్ ఇప్పిస్తానని నమ్మించి అతడి వద్ద రూ. 44 లక్షలు తీసుకున్న శైలేష్ థాకరే.. ఆ ఫ్లాట్ ని ఉమేష్ పేరిట రిజిస్టర్ చేయకుండా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.


తనకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న ఉమేష్ యాదవ్.. ఆ ఫ్లాట్ ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా శైలేష్ థాకరేను డిమాండ్ చేశాడు. లేదంటే తన డబ్బులు తనకు తిరిగివ్వాల్సిందిగా కండిషన్ పెట్టాడు. శైలేష్ థాకరే మాత్రం ఉమేష్ యాదవ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఫ్లాట్ ని అతడికి తిరిగి ఇవ్వకపోగా.. ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఉమేష్ యాదవ్ నాగపూర్ పోలీసులను ఆశ్రయించి శైలేష్ థాకరే పై చీటింగ్ కేసు పెట్టాడు. ఉమేష్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.