టీమిండియా విరాట్ కోహ్లీతో పాటు వెయిట్ లిఫ్టర్ సైకోమ్ మీరాబాయి చాను పేర్లను కూడా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం- రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు నామినేట్ చేస్తూ.. అవార్డుల కమిటీ కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. షట్లర్ కిదంబి శ్రీకాంత్ పేరును కూడా ఖేల్ రత్న అవార్డు కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అవును, విరాట్ కోహ్లీ, మీరాబాయి చానుల పేర్లను రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ చేస్తూ అవార్డుల కమిటీ నుండి సిఫార్సులు అందాయి' అని సంబంధిత అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకి తెలిపారు.


ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతూ.. అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నాడు. ఒకవేళ కోహ్లీకి ఖేల్ రత్నా దక్కితే.. సచిన్ టెండూల్కర్ (1997), ఎంఎస్ ధోనీ(2017) తర్వాత ఈ అవార్డును అందుకున్న మూడవ క్రికెటర్‌గా నిలుస్తాడు.


గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 48కేజీల క్యాటగిరీలో వరల్డ్ రికార్డు సృష్టించిన మీరాభాయ్ చానుకు గోల్డ్ మెడల్‌ దక్కింది. ఈ ఏడాది జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ ఆమెకు స్వర్ణం దక్కింది. ఒకవేళ మీరాభాయ్ కి ఖేల్ రత్నా దక్కితే.. కరణం మల్లేశ్వరి (1995), నమేఐరక్పం కుంజరిని దేవి (1996) తర్వాత ఈ అవార్డును అందుకున్న మూడవ వెయిట్ లిఫ్టర్ గా నిలుస్తుంది.


రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం భారత దేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని కీ.శే. రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం  1991-92లో ఈ  పురస్కారం పీవీ నరసింహారావు కాలంలో ప్రారంభింపబడింది. ఒక ప్రశంసాపత్రము, ఒక పతకము, 7.5 లక్షల నగదు బహుమతిని అవార్డు గ్రహీతలకు ఇస్తారు. కాగా ఇప్పటివరకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలను 34 మంది క్రీడాకారులు అందుకున్నారు.