ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా టీమిండియా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్న కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. కోచ్ రవిశాస్త్రి పనితీరుపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ విమర్శలు గుప్పించగా.. ఇప్పుడు వారితో పాటుగా వీరూ కూడా చేరిపోయాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రవిశాస్త్రి చేసిన మాటల గురించి ఇప్పుడేం చెప్తాడని ప్రశ్నిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా మైదానంలో అత్యుత్తమ జట్లు రూపొందుతాయి. డ్రెస్సింగ్ రూంలో కూర్చొవడం, మాట్లాడటం వల్ల కాదు. డ్రెస్సింగ్ రూంలో కూర్చొని బాగా ఆడతాం..సాధించి తీరుతాం అంటూ ప్రగల్భాలు పలికితే ఛాంపియన్‌లు అయిపోరు. బ్యాట్‌తో మాట్లాడినప్పుడే అత్యుత్తమ పర్యాటక జట్టుగా నిరూపించుకుంటాం' అని ఇంగ్లండ్ పర్యటనలో భారత వైఫల్యాల నేపథ్యంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు.. ఒక టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో చేజార్చుకున్న విషయం తెలిసిందే.


మూడో టెస్టులో భారత జట్టు 203 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టుగా నిలవడమే టీమిండియా లక్ష్యమని’ చెప్పుకొచ్చాడు. కానీ.. నాలుగో టెస్టులో 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 184 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. రవిశాస్త్రి వారం క్రితం చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ పలువురు చురకలంటిస్తున్నారు.