ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడట్లేదని తెలిసి తన పిల్లలు ఏడ్చారని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ ల‌క్ష్మణ్‌  ఓ కార్యక్రమంలో చెప్పారు. 'ఈ ఏడాది ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ఆడట్లేదన్న వార్తను నా పిల్లలు సర్వజిత్, ఆచింత్యాలు వార్తా పత్రికల్లో చూసి ఏడవడం మొదలుపెట్టారు. మా జ‌ట్టుకు వార్నర్ ఎంత‌టి కీల‌క ఆట‌గాడో వారికి తెలుసు. వారు వార్నర్‌ను అభిమానిస్తారు. నాన్న.. ఇది నిజమేనా? ఈ ఐపీఎల్‌లో వార్నర్ ఆడట్లేదా? అని నన్ను ఆడిగారు. వారిని నేను ఎదో సర్ది చెప్పా. వార్నర్ ఆడట్లేదని తెలిసి వారిద్దరూ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిన సమయంలోనూ వారు చాలా తీవ్ర నిరాశ చెందారు' అని ల‌క్ష్మణ్ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో బాల్ టాంప‌రింగ్‌‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్,స్టీవ్ స్మిత్ పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్ క్రాప్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.


స్మిత్, వార్నర్‌లపై విధించిన నిషేధం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌పై కూడా ప్రభావం చూపింది. దీంతో వారిద్దరూ  ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌ నుంచి ఇద్దరూ తప్పుకున్నారు. ఐపీఎల్‌లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా... డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో ఆయా రెండు ప్రాంఛైజీలు సైతం ఈ ఇద్దరినీ కెప్టెన్సీ నుంచి తొలగించాయి. ఈ ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు కేన్ విలియ‌మ్సన్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించారు.