ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పురుషుల వుషు 60 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోటీల్లో భారత ఆటగాడు సూర్యభాను ప్రతాప్‌ ఇరాన్‌కి చెందిన ఇర్ఫాన్ అహన్‌గరియన్‌తో పోటీ పడ్డాడు. కానీ మ్యాచ్‌లో ఓడిపోయాడు. ఆ తర్వాత.. మ్యాచ్‌లో భాగంగా కాలికి తీవ్ర గాయం కలగడంతో కనీసం నిలబడే స్థితిలో కూడా తను ఉండలేకపోయాడు. విజేతను ప్రకటించేటప్పుడు రిఫరీ ఇద్దరు ఆటగాళ్ళను రింగ్‌లోకి పిలిచినప్పుడు కూడా కాలి బాధను దిగమింగుకుంటూనే సూర్యప్రతాప్ రావడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది గమనించిన ప్రత్యర్థి ఆటగాడు ఇర్ఫాన్ విజేత ప్రకటన జరిగాక,, జాగ్రత్తగా సూర్యప్రతాప్‌ను భుజాల మీద వరకు ఎక్కించుకొని.. నెమ్మదిగా రింగ్ దాటించి కోచ్ వద్దకు తీసుకెళ్లి దింపాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందరో భారతీయులు ఇర్ఫాన్ చేసిన పనికి ఫిదా అయ్యారు. ఆ క్రీడాకారుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇర్ఫాన్‌.. ఈ క్రీడల్లో నువ్వు బంగారు పతకం గెలుస్తావో లేదో తెలియదు.. కానీ కోట్లాది ఇండియన్స్ మనసులు గెలిచావు’ అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేశారు. 


కాగా.. ఈ మ్యాచ్‌లో ఓడిన సూర్యప్రతాప్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం పురుషుల వుషులో భారత్‌ 4 కాంస్య పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్‌కు వుషులో అత్యధిక పతకాలు కేవలం ఈ ఆసియా క్రీడల్లోనే రావడం గమనార్హం. వుషుకే చైనీస్ కుంగ్‌ఫూ అనే పేరు కూడా ఉంది. చైనాలో బాగా పాపులర్ అయిన ఈ క్రీడలో ఈ మధ్యకాలంలో భారత్ కూడా రాణిస్తోంది.