ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం 15 మంది ఆటగాళ్ల పేర్లను సెలక్షన్‌ బృందం ప్రకటించింది. అయితే ఇందులో నిలకడకు మారుపేరైన మన తెలుగు తేజం అంబటి రాయుడి పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాది కాలం నుంచి నిలకడగా ఆడుతున్న రాయుడు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడమే అతని కొంపముంచిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో ఫాంలో లేకపోవడమే అతనిపై వేటు పడటానికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడి ఫెర్ఫార్మెన్స్ ను ఒక్కసారి పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ లో రాయుడి జోరు..
పది సీజన్లు పాటు ముంబయి ఇండియన్స్‌ కు సేవలందించిన అంబటి రాయుడి..తర్వాతి సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. మహీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా  ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు అంబటి రాయుడు. పరుగుల వరద పారించాడు. మొత్తం 602 పరుగులు చేశాడు. అతడి ప్రదర్శన మెచ్చిన బీసీసీఐ సెలక్టర్లు వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. 


గత ఏడాది నుంచి ప్రదర్శన భేష్
ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ జట్టులో పునరాగమనం చేసిన అంబటి రాయుడు ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆసియాకప్‌లో హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌పై అర్ధ శతకాలు మెప్పించాడు. ఈ టోర్నీలో మరో రెండు మ్యాచుల్లో అజేయంగా నిలిచాడు. పరిస్థితులను అధ్యయనం చేసి ఆడుతున్న రాయుడికి  కెప్ట్ న్ విరాట్‌ కోహ్లీ నుంచి కూడా మంచి ప్రోత్సహం దక్కింది. దీంతో వెస్టిండీస్‌ సిరీస్‌లో నాలుగో వన్డేలో శతకం సాధించి 2018ని ఘనంగా ముగించాడు. 56 సగటుతో 392 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 


ఆఖరి మెట్టుపై బోల్తా
అయితే 2019 ఏడాది రాయుడిని కలిసి రాలేదు..ఈ ఏడాదిని రాయుడు డకౌట్‌తో ఆరంభించాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో  పేలవ ప్రదర్శనతో విఫలమవడంతో  మూడో మ్యాచ్‌లో వేటు పడింది. అయితే కివీస్ సిరీస్‌లో ఓ అర్ధశతకంతో మొస్తరుగా రాణించినా  కీలక సమయాల్లో ఔటయ్యాడు.


అదంతా అటుంచితే సొంతగడ్డ మీద ఆసీస్‌పై మళ్లీ విఫలమయ్యాడు. ఈ సిరీస్ లో  13, 18, 2 పరుగులు మాత్రమే చేశాడు. వలర్డ్ కప్ లో జట్టులో స్థానం సంపాదించుకునేందుకు మళ్లీ ఐపీఎల్ రూపంలో ఛాన్స్ వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ లోనూ నిరాశాజనక ఫామ్‌నూ కొనసాగించాడు రాయుడు. ఈ ఏడాదిలో రాయుడి పెర్ఫార్మెన్స్  చూసిన సెలక్టర్లు అతడిపై వేటు వేయక తప్పలేదు..