World Cup 1983: ఇండియా ప్రపంచకప్ 1983 విజయానికి నేటికి 40 ఏళ్లలో ఎన్నో మార్పులు
World Cup 1983: క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా ఇప్పుడు చాలా పటిష్టమైన జట్టు. ఒకప్పుడు పేలవమైన జట్టు. క్రికెట్ పసికూనగా ఉన్న సమయంలోనే ఇండియా తొలి ప్రపంచ కప్ సాధించింది. ఆ ప్రపంచకప్పే ఇండియన్ క్రికెట్‌లో సమూల మార్పులు తెచ్చింది.
World Cup 1983: క్రికెట్ ప్రపంచంలో ప్రపంచకప్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి నాలుగేళ్లకోసారి పోటీ పడే ప్రపంచకప్ టైటిల్ గెలవాలని ప్రతి దేశానికి ఉంటుంది. కానీ ఇండియా మాత్రం క్రికెట్‌లో పసికూనగా ఉన్నప్పుడే ఆ టైటిల్ సాధించేసింది. అదే 1983 ప్రపంచకప్. ఇండియా తొలి ప్రపంచకప్ చేజిక్కించుకుని, ప్రపంచాన్ని నివ్వెరపర్చిన అపురూప దృశ్యానికి నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1983 జూన్ 25వ తేదీన లార్డ్స్ మైదానంలో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడ్డాయి. క్రికెట్‌లో ఆ రోజుల్లో వెస్డ్‌ఇండీస్ అంటే అరివీర భయంకరమైన జట్టు. అందుకే 1975, 1979 ప్రపంచకప్ టైటిల్స్‌ను వరుసగా రెండుసార్లు గెల్చుకుని హ్యాట్రిక్ కోసం బరిలో దిగింది. వివియన్ రిచర్డ్స్, రిచర్డ్‌సన్, మెల్కం మార్షల్, ఆంబ్రోస్ వంటి దిగ్గజాలున్న జట్టు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే మార్షల్ అంటే ప్రతి ఒక్కరికీ వణుకే. వివియన్ రిచర్డ్స్ లాంటి ఆటగాడిని అవుట్ చేయడం ఏ బౌలర్‌కు అంత సులువు కానే కాదు.
అసలు 1983 ప్రపంచకప్‌లో ఇండియా ఫైనల్ వరకూ రావడమే చాలా గొప్ప. మ్యాచ్ జరిగే రోజు కూడా ఏ ఒక్కరూ ఇండియా ఫేవరేట్ టీమ్‌గా అంచనా వేయలేదు. బుకీస్ కూడా వెస్టిండీస్‌కు అనుకూలంగానే బెట్టింగులు వేసేవారు. అందుకే ఇది అత్యంత చెత్త ఫైనల్ అని కూడా అభివర్ణించిన పరిస్థితి ఉంది. అంటే అందరి దృష్టిలో ఇండియా ఓ చెత్త టీమ్. ఇలాంటి టీమ్ ఫైనల్ వరకూ రావడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అందరి హేళన, అవమానాల్ని తట్టుకుని దేశం కాని దేశంలో ఏ మాత్రం ప్రేక్షకుల మద్దతు లేకుండా కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఫైనల్ వరకూ వెళ్లింది.
టీమ్ ఇండియా టాస్ ఓడటంతో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండు పరుగుల స్కోర్ వద్దే గవాస్కర్ అవుట్ అయ్యాడు. శ్రీకాంత్, మొహిందర్ అమర్‌నాథ్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ వెస్టిండీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోతున్నారు. 111 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత మిగిలిన నాలుగు వికెట్లకు కేవలం 72 పరుగులే జత చేయగలిగింది. అంటే వెస్టిండీస్ టార్గెట్ కేవలం 184 పరుగులు మాత్రమే. ఇంకేముంది ఊహించనట్టే ప్రపంచకప్ వెస్డిండీస్‌దే అనుకున్నారంతా. చాలా సులభమైన లక్ష్యం. కానీ కపిల్ దేవ్ నేతృత్వంలోని ఇండియా చాలా చిత్తశుద్ధితో బౌలింగ్ కోసం గ్రౌండ్‌లో అడుగెట్టింది. నాలుగో ఓవర్‌లోనే వెస్టిండీస్ బ్యాటర్ గ్రీనిడ్జ్..బల్విందర్ సంధు బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత కాస్సేపటికి రిచర్డ్స్, లాయిడ్‌లు అవుట్ కావడంతో వెస్టిండీస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
అయితే ఆ తరువాత డూజోన్, మార్షల్‌లు ఏడవ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అయినా ఫలితం లేకపోయింది. వెస్డిండీస్ స్కోర్ 140 పరుగుల వద్ద ఉన్నప్పుడు చివరి వికెట్ మొహిందర్ అమర్‌నాధ్ తీయడంతో వెస్టిండీస్ కధ ముగిసింది. చరిత్రలో నిలిచిపోయేలా, అందర్నీ నివ్వరపరుస్తూ అప్పటి క్రికెట్ పసికూన ఇండియా తొలి ప్రపంచకప్ ముద్దాడింది. ఈ ఘటనే టీమ్ ఇండియా క్రికెట్‌లో సమూల మార్పులు, ఇవాళ్టి ఇండియా పటిష్ట స్థానానికి కారణమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook