Smartphone Charging: మనం మన వెంట సెల్ ఫోన్ చార్జర్ తీసుకోకుండా ఎప్పుడైనా ఏదైనా ప్రయాణాలపై వెళ్లినప్పుడు, లేదా విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన మొబైల్లో చార్జింగ్ లేకుంటే ఎంత ఇబ్బంది పడతామో తెలిసిందే. మీకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా.. అలాంటప్పుడు ఎవరికైనా మనసులో వెంటనే వచ్చే ఆలోచన ఏంటి ? చార్జర్ సహాయం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. ఇప్పటివరకు అది ఒక ఊహ మాత్రమే.. కానీ ఇకపై అదే నిజం కాబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవును వినడానికి కొంత విచిత్రంగానే ఉన్నప్పటికీ.. చార్జర్ సహాయం లేకుండానే సెల్ ఫోన్ చార్జింగ్ చేసే అధునాతన టెక్నాలజీ రాబోతోంది. చార్జింగ్ టెక్నాలజీలో ఇటీవల కాలంలో మనం చూసిన ఆవిష్కరణల్లో ఒకటి వైర్లెస్ చార్జింగ్ కాగా.. రెండోది స్పీడ్ చార్జింగ్.. ఇక ఇప్పుడు రాబోయే టెక్నాలజీ ఏంటంటే.. శరీరంలోని ఉష్ణోగ్రతను గ్రహించి సెల్ ఫోన్ చార్జింగ్ అవడం. 


సెల్ ఫోన్‌ను జేబులో పెట్టుకుని లేదా చేతిలో పట్టుకుని ఛార్జింగ్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్లోకి రావొచ్చు అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఐఐటీ మండికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ సోనీ చెబుతున్న వివరాలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేయకమానదు. ఐఐటిలు అంటేనే.. సాంకేతిక పరిజ్ఞానానికే సవాలు విసిరే అంశాలపై పరిశోధనలు చేయడంలో దిట్టగా పేరున్న అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐఐటి మండిలో బాడీ హీట్ ఆధారంగా సెల్ ఫోన్ చార్జింగ్ చేసే టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి. 


ఒకవేళ ఈ పరిశోధనలో పరిశోధకులు విజయం సాధిస్తే.. ఇకపై చార్జర్ సహాయం లేకుండానే మొబైల్ చార్జింగ్ చేసుకునే సౌకర్యం మీ అరచేతిలోకే రానుంది. ఆ రోజు మరేంతో దూరంలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాడీ హీట్ ఆధారంగా సెల్ ఫోన్ చార్జింగ్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే.. చార్జర్‌తో సమస్య మాత్రమే కాదండోయ్.. అసలు విద్యుత్ తోనే పని లేదు. మొదట సెల్ ఫోన్ చార్జింగ్ పైనే ప్రయోగం జరుగుతున్నప్పటికీ.. అందులో సక్సెస్ అయితే.. ఆ తరువాత ఇయర్ బడ్స్ లాంటి తేలికపాటి బ్యాటరీలు ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి మాసివ్ బ్యాటరీ ఉండే ల్యాప్‌టాప్స్ వరకు ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రతపైనే వీటి చార్జింగ్ ఆధారపడి ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు.