COVID-19 in Telangana: తెలంగాణలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం దాటే సమయానికే రాష్ట్రంలో నేడు ఒక్క రోజే 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం దాటే సమయానికే రాష్ట్రంలో నేడు ఒక్క రోజే 10 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో గుర్తించిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరింది. కరోనావైరస్‌కి అడ్డుకట్ట వేయడం కోసం ప్రభుత్వం చేస్తోన్న కృషికి మద్దతుగా పలువురు ప్రముఖులు పెద్దమనసుతో ముందుకొచ్చి భారీ మొత్తంలో విరాళాలు అందచేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం కూడా భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లా మాదుగుల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తన రెండు నెలల పెన్షన్ ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు.
కోహినూర్ గ్రూప్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును గ్రూప్ చైర్మన్ మహ్మద్ అహ్మద్ ఖాద్రి ప్రగతి భవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.
అనురాగ్ విద్యాసంస్థలు 25 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.దీనికి సంబంధించిన చెక్కును అనురాగ్ సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.
అపర్ణ కన్‌స్ట్రక్షన్ తరుఫున ఆ సంస్థ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు.