ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి మురళి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకోవడం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు కదంతొక్కాయి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మంగళవారం ఏబీవీపీ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. మంగళ, బుధ వారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను, ఎంఈడీ కోర్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను వాయిదా వేస్తున్నట్టు ఓయూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ రణరంగాన్ని తలపించింది. పలు విద్యార్ధి సంఘాలు ఏకమై ప్రభుత్వనికి వ్యతిరేకంగా  క్యాంపస్  పరిసరాల్లో నినాదాలు, నిరసనలు చేపట్టారు. మురళి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసాడని.. పోలీసులు దానిని మాయం చేశారని విద్యార్ధి సంఘాల ఆరోపణ. కానీ మురళీ పీజీ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో సూసైడ్ చేసుకున్నాడని పోలీసుల వాదన. 


మురళి సిద్దిపేట దౌలాపూర్ గ్రామానికి చెందిన యువకుడు. ఓయూలో ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం హాస్టల్ బాత్రూంలో ఉరేసుకుకొని మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం పోస్ట్ మార్టం పూర్తయి.. స్వగ్రామానికి తరలించారు.