MIM MLA Akbaruddin Owaisi Comments on Murder Attempt on Him: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తనపై గతంలో జరిగిన హత్యాయత్నం ఘటన గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను హతమార్చేందుకు కుట్రపన్నిన వారిని క్షమిస్తున్నాను అని ప్రకటించిన అక్బరుద్దీన్ ఒవైసీ... తనని ఏ ప్రజల మధ్యనైతే చంపేందుకు ప్రయత్నించారో.. అదే ప్రజల మధ్య వారిని క్షమిస్తున్నాను అని అన్నారు. తనని మట్టుపెట్టేందుకు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిన వారిని కూడా క్షమిస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం హైదరాబాద్ పాత బస్తీలోని బార్కస్‌లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ విద్యా సంస్థకు సంబంధించిన 11వ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ అక్కడ సభా వేదికపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్షమించడం, విద్యను అందించడం లాంటి విషయాలే మనుషుల మధ్య ప్రేమను, ఐక్యమత్యాన్ని పెంచుతాయని చెప్పే క్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కత్తులతో తనను నరికి చంపాలని చూసిన వారితో పాటు తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లిన వారిని సైతం తాను క్షమిస్తున్నా అని పేర్కొన్నారు. అంతేకాదు.. కత్తులతో ప్రత్యర్థుల దాడి అనంతరం చావు బతుకుల మధ్య ఉన్న తనను ఎమ్మెల్యే బలాల బతికించారని గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ బలాలకు జీవితకాలం రుణపడి ఉంటానని అన్నారు. 


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనియాంశమయ్యాయి. 2011 లో అక్బరుద్దీన్‌ ఒవైసీపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు దాడి చేసి హతమార్చేందుకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. తొలుత కత్తులతో దాడిచేసిన దుండగులు ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గన్‌మెన్‌ ఎదురుకాల్పులకు దిగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న అక్బరుద్దీన్ ఒవైసీని వారి సొంత ఆస్పత్రి అయిన ఒవైసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.