దేశభవిష్యత్తు కోసమే `ప్రత్యామ్నాయ కూటమి`
దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు కోసం, రాష్ట్రాల ప్రగతి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో విస్తృతంగా చర్చలు చేపట్టారు.
దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు కోసం, రాష్ట్రాల ప్రగతి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో విస్తృతంగా చర్చలు చేపట్టారు. అందులో భాగంగా బుధవారం ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. సమకాలీన దేశ రాజకీయాల మీద, దేశ ప్రగతి కోసం రాజకీయ పార్టీల్లో రావాల్సిన పరివర్తన మీద, ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాల మీద ఈ సందర్భంగా చర్చించారు.
అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి వివిధ పార్టీల నుండి అతి తక్కువ కాలంలో ఇంత మంచి స్పందన రావడం శుభసూచకం అన్నారు. ఈ ప్రయత్నాన్ని రాజకీయ ప్రత్యామ్నాయ కూటమిగానో, లేదా మూడవ కూటమి గానో చూడవద్దు అని కోరారు. ఇది దేశ ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న ఒక చొరవగానే చూడాలి గాని ఇది ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం కాదని చెప్పారు. అంతేతప్ప పదవులపై తనకు ఆశ లేదని, ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్ష అంత కన్నా లేదని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్రాల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చొరవను ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. ఈ బంధాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అనే దృష్టిలో కాకుండా, భారతదేశ వికాసం కోసం చేసే ప్రయత్నంగా చూడాలని కోరారు. కేసీఆర్.. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో మార్పు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిది. ఈ ప్రయత్నాన్ని సమాజ్‌వాదీ పార్టీ సమర్థిస్తుందన్నారు.