'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న క్రమంలో ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు పాక్షిక సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరగడం గుబులు రేకెత్తిస్తోంది. దీంతో కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 


లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితి కూడా రోజు రోజుకు దిగజారుతోంది. అన్ని రంగాల్లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో  లాక్ డౌన్ కొనసాగించాలా..? వద్దా..? లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా పాక్షిక సడలింపు ఇవ్వాలా..? ఒక వేళ సడలింపు ఇచ్చిన పక్షంలో కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేదెలా..? ఇలాంటి అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రివర్గంతో చర్చించనున్నారు.



కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు లాక్ డౌన్ అమలు చేస్తారు. అందుకోసమే ఈ నెల 19న కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.  ఏప్రిల్ 20 తర్వాత  ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తారు. ఈ నెల 20 తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేద్దామని నిన్న (బుధవారం) జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో 19న జరిగే కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..