హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కి రానున్నారని తెలుస్తోంది. మార్చి 15న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నట్టు సమాచారం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపి ఈ సభను ఏర్పాటు చేస్తోంది. తొలుత మార్చి 7 లేదా 14 తేదీల్లో ఈ సభ నిర్వహించేందుకు వ్యూహం రచించినప్పటికీ.. ఆ తర్వాత మార్చి 15వ తేదీని ఫైనల్ చేసుకున్నారు. అమిత్ షా రానున్న సభ కావడంతో సభను విజయవంతం చేసేందుకు బీజేపి శ్రేణులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ సభలో పాల్గొనే అవకాశాలున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.


ఇదిలావుంటే, పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ చట్టానికి వ్యతిరేకంగా 10 లక్షల మందితో సభ ఏర్పాటు చేస్తానని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఏఏను వ్యతిరేకిస్తున్న ఎంఐఎం పార్టీ సైతం కేసీఆర్‌ చేపట్టే సభకు మద్దతు ప్రకటించనుంది. పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాకుండా రానున్న బడ్జెట్ సమావేశాల్లో చట్టానికి వ్యతిరేకంగా ఓ బిల్లు సైతం పాస్ చేస్తామని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నగరం నడిబొడ్డునే బీజేపీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..