బిగ్ బాస్-3 సీజన్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి తనను కలిసిన ఆ ప్రోగ్రాం ఇంచార్జ్‌లు శ్యామ్, రఘులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడ్డారని యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వారి చేతిలో ఎదురైన చేదు అనుభవం ప్రకారం చూస్తే, బిగ్ బాస్ షోలో పాల్గొనే వారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్వేతా రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు.. శ్యామ్, రఘు అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్-3 షోలో పాల్గొనాల్సిందిగా ప్రతిపాదిస్తూ ముంబై నుంచి షో నిర్వాహకులతో పాటు హైదరాబాద్‌లోని మా టీవీకి చెందిన కో ఆర్డినేటర్లు తనను సంప్రదించారని చెప్పిన ఆమె.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో వారు తనతో పలుమార్లు భేటీ అయినట్టు పోలీసులకు తెలిపారు. తనను బిగ్‌బాస్‌ షోలోకి తీసుకుంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్న తర్వాత ముఖం చాటేశారని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై చర్చించేందుకు ఇటీవల శ్రీనగర్‌కాలనీలోని ఓ రెస్టారెంట్‌లో కలుద్దామని ప్రోగ్రామ్ ఇన్‌చార్జి శ్యామ్, రఘులు వచ్చారని.. ఆ సమావేశంలోనే శ్యామ్, రఘులు తనతో అసభ్యకరంగా మాట్లాడారని.. ఒకవేళ షోలో పాల్గొనాలంటే తమ బాస్‌ను ఎలా ఇంప్రెస్ చేస్తారని ప్రశ్నించారని శ్వేతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన తాను వారికి ఎదురు తిరగడంతో మాటమార్చి అక్కడి నుంచి వెళ్లిపోయారని శ్వేతా రెడ్డి వెల్లడించారు. 


తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగానే బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశించే వారితోనూ అలాగే ప్రవర్తించి ఉంటారని, అవసరమైతే లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటారని శ్వేతా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం వెండితెర వర్గాల్లో కలకలం సృష్టించింది. ఎవరో ఒకరు బయటికొచ్చి ఫిర్యాదు చేస్తే కానీ మిగతా బాధితులు కూడా బయటకు రారు కదా అని శ్వేతా రెడ్డి పోలీసుల వద్ద అభిప్రాయపడినట్టు సమాచారం. మీ టూ వ్యవహారం లాగే ఆమె ఆశించినట్టుగానే ఇంకా ఎవరైనా బాధితులు ముందుకొస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.