ఐటీ గ్రిడ్స్ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు స్పందించారు. అమరావతిలో ఈ రోజు టీడీపీ బూత్ స్థాయి కన్వీనర్లతో ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ పార్టీని లేని టెక్నాలజీ టీడీపీ సొంతమనీ... 24 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల డేటాను సేకరించామని ఏపీ సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 తమ పార్టీ కార్యకర్తల డేటాను తెలంగాణ ప్రభుత్వం దొంగలించుకొని మనపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల డేటాను వైసీపీ ఇచ్చేందుకే కేసీఆర్ ఇలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో ఏదైనా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని..తమ ఓపికకు కూడా ఓ పరిమితి ఉందని చంద్రబాబు హెచ్చరించారు. 


మోదీ, కేసీఆర్, జగన్ లకు దమ్ముంటే రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముసుగు తీసి ప్రచారం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సవాల్ విసిరారు. వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇక్కడి ప్రతిపక్ష నేత జగన్ సామంత రాజుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని సామంత రాజ్యం చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని చంద్రబాబు ఆరోపించారు.


ఏపీ ప్రజల సమాచారాన్ని అక్రమంగా భద్రపరిచారనే ఆరోపణలపై హైదరాబాద్ లోని టీడీపీ సాంకేతిక సహకారం అందించే సంస్థ ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై మరోమారు స్పందించారు