నాపై పోటీకి హేమాహేమీలను రమ్మంటే జోకర్లను ఉసిగొల్పుతున్నారు - అసదుద్దీన్
హైదరాబాద్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసదుద్దీన్ పై పోటీకి సిద్ధం చేస్తున్న తరుణంలో ఎంఐఎం చీఫ్ దీనిపై స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనపై పోటీకి బలమైన అభ్యర్ధిని నిలబెట్టమంటే ..జోకర్ల పేర్లను తెరపైకి తెస్తున్నారని రాజాసింగ్ ను ఉద్దేశించి అసదుద్దీన్ ఎదేవ చేశారు. తనపై పోటీ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా.. అమిత్ షా వచ్చాన సరే.. తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమేనని అసదుద్దీన్ మరోమారు స్పష్టంచేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కైవసం చేసుకున్న ఎంఐఎం పార్టీని ఈ సారి ఎలాగైనా సాగనంపాలని అధికార పార్టీ బీజేపీ పట్టుదలతో ఉంది. గట్టి అభ్యర్ధి వేటలో ఉన్న తరుణంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీకి ఫైర్ బ్రాండ్ గా కనిపించారు. నిత్యం ఎంఐఎం నేతల తీరును ఎండగడుతూ కరుడుగట్టిన హిందుత్వ వాదిగా రాజాసింగ్ కు మంచి పేరు ఉంది. ఇదే ఆయన బీజేపీ అధిష్టానం దృష్టిలో పడటానికి కారణమైంది. ఇటీవలే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. రాజాసింగ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి అసద్ పై పోటీకి సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఇలా తీవ్ర స్థాయిలో స్పందించారు.