ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారక్క జాతర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఘనంగా చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మేడారం జాతరను జాతీయపండుగగా ప్రకటించాలని తీర్మానం చేసింది. ఈ ఏడాది జరుగుతున్న ఈ జాతరకు ప్రభుత్వం 80కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద పండగ ఇది. అందుకే దీనికి "దక్షిణ కుంభమేళా" అనే పేరుకూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉప రాష్ట్రపతిని కలిసి మేడారం జాతరలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. వెంకయ్య నాయుడు కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన మంత్రిని కోరినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కుంభమేళా తరహాలో మేడారం జాతరకు ప్రచారం కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు.  


మేడారం జాతరకు గతేడాది 10 మిలియన్ల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మంది భక్తులు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక.. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. వచ్చే వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. జరుగుతున్న రెండో మేడారం జాతర ఇది. మొదటిసారి 2016 ఫిబ్రవరి 17-20 వరకు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది జాతర జనవరి 31-ఫిబ్రవరి3 వరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్‌తో పాటు గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ.  సమ్మక్క-సారక్క జాతరకు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.