పసికందు కిడ్నాప్ కేసు చేధించిన సిటీ పోలీసులు.. బిడ్డకు కమీషనర్ పేరు పెట్టుకున్న తల్లి..!
హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుండి బిడ్డను తస్కరించిన కిడ్నాపర్ నుండి పసికందును చాలా చాకచక్యంగా పట్టుకున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు.
హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బిడ్డను తస్కరించిన కిడ్నాపర్ నుండి పసికందును చాలా చాకచక్యంగా పట్టుకున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. వివరాల్లోకి వెళితే..యల్లమ్మ గూడేనికి చెందిన దంపతులు తమ బిడ్డకు వాక్సిన్ వేయించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో తనను తాను నర్సుగా పరిచయం చేసుకున్న ఒకామె.. ఇంజక్షన్ వేస్తానని బిడ్డను లోపలికి తీసుకెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విచారించిన తల్లిదండ్రులు.. ఆఖరికి తమ పసిబిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని గ్రహించారు. ఆ తర్వాత సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశారు.
సుల్తాన్ బజార్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం.చేతన ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజీలు అన్నీ తనిఖీ చేయించారు. ఈ క్రమంలో బిడ్డను తస్కరించిన మహిళ, పసికందును హైదరాబాద్ నుండి బస్సులో బీదర్ తీసుకెళ్లినట్లు గ్రహించారు. వెంటనే కమీషనర్ తన టీమ్‌తో సహా బీదర్‌కు బయలుదేరివెళ్లి సోదాలు నిర్వహించారు. అనుమానితులు అందరినీ సంప్రదించారు. ఆ తర్వాత అదనపు ఆధారాలు సేకరించి.. ఆ మహిళ తీసుకెళ్లిన బిడ్డ బీదర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్నట్లు కనుగొన్నారు.
ఆ తర్వాత అక్కడికి వెళ్లి అనుమాతుల్ని అరెస్టు చేసి.. ఆ బిడ్డను మళ్లీ హైదరాబాద్ తీసుకొచ్చి తన తల్లికి అప్పగించారు. తన బిడ్డను చూడగానే ఆ పసికందు తల్లి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డకు పోలీసులే పునర్జన్మ ప్రసాదించారని తెలిపారు. తన బిడ్డకు మరో జన్మ ప్రసాదించిన కమీషనర్ చేతన పేరే తన కూతురికి పెట్టుకుంటానని ఆమె మీడియాకి తెలిపారు.
ఈ కేసును చేధించడంలో టాస్క్ ఫోర్సు అధికారులతో పాటు కర్ణాటక పోలీసులు కూడా సుల్తాన్ బజార్ పోలీసులకు సహకరించడంతో సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.