ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇటీవలే తెలంగాణలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అవుతానని తెలిపిన బండ్ల గణేష్.. కాంగ్రెస్ టికెట్  ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేయడం లేదు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ అధిష్టానం గణేష్‌కు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదా పదవిని కట్టబెట్టింది. ఈ హోదాలో ప్రస్తుతం ఆయన అన్ని నియోజకవర్గాలలో పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో హుజూర్‌నగర్‌ నియోజవర్గంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి జనాల వద్దకు వెళ్లారు గణేష్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడారు. తాను టీఆర్ఎస్ పాలన పట్ల విముఖతతో ఉన్నానని.. ప్రజలు కూడా ప్రభుత్వం మారితే బాగుండుననే ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అందిస్తే పార్టీ నష్టపోతుందని తెలిసినా సరే.. అందుకు ఒప్పుకొని తన ఉదాత్తత చాటుకున్నారని గణేష్ అన్నారు. 


ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇటీవలే బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే... బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. షాద్ నగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏదో ఒక చోటు నుండి కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందని బండ్ల గణేష్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఆయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ కేటాయించలేదన్న సంగతి తెలిసిందే.