హైదరాబాద్: ఇటీవలే మద్యం ధరలను పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీరు ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బీర్లపై ప్రస్తుతమున్న రేటును దాదాపు 12 శాతం పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాగా.. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం కేసీఆర్ వద్ద పరిశీలనలో ఉంది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.300 కోట్లు ఆదాయం వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లెక్కలు వేసుకుంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈసారైనా ధర పెంచాలని బ్రూవరీ కంపెనీలు కొంతకాలంగా కోరుతున్నాయి. సీఎం సంతకం చేస్తే ఒక్కో బీరుపై కనీసం రూ.6 చొప్పున ధర పెరిగే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. మూడు నెలల కిందటే రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీకి ధరలను సమీక్షించే బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతమున్న ధరలు,  జీఎస్‌టీ తదితర విషయాలను పరిగణించిన కమిటీ.. 12 శాతం ధరలు పెంచేందుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. కమిటీ సిఫార్సుల ఆధారంగానే ఎక్సైజ్‌ శాఖ  తాజా ధరల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే సీఎం నిర్ణయం మేరకే ధరల పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


రాష్ట్రంలో బీర్ల వినియోగం ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్‌ నివేదికలున్నాయి. గతేడాది ఎక్సైజ్‌ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఎక్సైజ్‌ ఆదాయం మరింత పెరుగుతుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలు వేసుకుంది. తాజా ధరల పెంపునకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశాలున్నాయి.