Big Relief To Telangana: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ సర్కార్ కు భారీ ఊరట లభించింది. 10 వేల 200 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర సర్కార్ తాజాాగా అనుమతి ఇచ్చింది. ఈ నిధులకు సంబంధించి రుణం తీసుకోవడానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించినా కేంద్రం నిలుపుదల చేసింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం మోడీ ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఉజ్వల్‌ డిస్కం అస్యూరెన్స్‌ యోజన కింద రాష్ట్రాల డిస్కంలకు సంబంధించిన 75 శాతం రుణాలను టేకోవర్ చేసుకోవచ్చు. ఇందుకోసం అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, డిస్కంలతో రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం 2017లో ఈ పథకంలో చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఉదయ్ స్కీమ్ ఒప్పందం ప్రకారం డిస్కంల రుణాలను టేకోవర్‌ చేసుకోకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. దీంతో సీరియస్ గా స్పందించిన కేంద్రం తెలంగాణకు సంబంధించి రుణాలపై కోతలు విధించింది. 75 శాతం డిస్కంల రుణాలకు సరిపడా 10 వేల 200 కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలను తెలంగాణ సర్కార్ తీసుకోకుండా ఆంక్షలు పెట్టింది. ఈ విషయంలోనే గతంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని, కావాలనే నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రగతిశీల రాష్ట్రానికి కావాలనే అడ్డుపుల్లలు వేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేయడానకి సిద్ధమనే సంకేతం ఇచ్చారు.


గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రితో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్,  ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్ హస్తినలో ఉన్నారు. తెలంగాణ ఉన్నతాధికారుల బృందం బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసింది. కేంద్రం ఆంక్షలు విధించిన వివిధ రుణాలపై చర్చలు జరిపారు. ఉదయ్‌ రుణాలకు తిరిగి అనుమతి ఇవ్వాలని కోరారు. 2017–21కు సంబంధించిన డిస్కంల నష్టాలు రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసుకుందని, ఇందుకు సంబంధించి గత నెలలో జీవో జారీ చేసినట్టు తెలిపింది. దీంతో గతంలో ఆంక్షలు విధించిన రూ.10,200 కోట్ల రుణాలను తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అనుమతిచ్చారు. ఈ మేరకు లేఖను  తెలంగాణ అధికారులకు ఇచ్చారు. పీడీఎస్‌ అవసరాల కోసం కస్టమ్‌ మిల్లింగ్‌ పథకం కింద తెలంగాణ సర్కార్ గత ఏడాది ఎఫ్‌సీఐకి బకాయిపడిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది.


తెలంగాణ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘస్తోందని కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే అస్త్రంగా చేసుకుని తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండగా రూ 10,200 కోట్ల రుణానికి కేంద్ర సర్కార్ ఓకే చెప్పడం చర్చగా మారింది. కేంద్ర పెద్దలతో కేసీఆర్ మాట్లాడారని, అందుకే వెంటనే అనుమతులు వచ్చాయని అంటున్నారు. బీజేపీ పెద్దలతో కేసీఆర్ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


Read also: Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?  


Read also: Chandrababu Bhadrachalam: చంద్రబాబు భద్రాచలం పర్యటన అందుకేనా? అక్కడ ఏం జరగనుంది?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి