ఒకవైపు పాలనలో, మరోవైపు రాజకీయాల్లో దూసుకుపోతున్న లీడర్.. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆయన ఒక యూత్ ఐకాన్.. రోల్ మోడల్.  దేశంలోని యువత ప్రతి రాష్ట్రంలోనూ ఆయనలాంటి లీడర్ ఉంటే బాగుంటుంది అనే కోరుకుంటుందని కొందరు చెబుతుంటారు.  ప్రస్తుత భారత సమకాలీన రాజకీయాల్లో యంగ్, డైనమిక్, పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా ఆయన నిలిచిపోతారనడంలో సందేహం లేదన్నది మరికొందరి అభిప్రాయం. కేటీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టాక ఎన్నో అవార్డులు, ప్రశంసలు కూడా అందుకున్నారు.


తాజాగా కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కనుంది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ కేటీఆర్‌కు 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించింది. దీనితో పాటు పట్టణ మౌలిక వసతులు భేషుగ్గా ఉన్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కనుంది. డబుల్ బెడ్రూం, మిషన్ కాకతీయ, హరితవనం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను బిజినెస్ వరల్డ్ అందజేయనుంది.