హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ)లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్ధి సంఘాలు కాలేజీలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కాలేజీ పోలీస్ పహారాలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారుప్రాంతంలో ఉన్న సీబీఐటీ కాలేజీలో యాజమాన్యం ఒక్కసారిగా ఫీజులను 1.13 లక్షల నుండి రెండు లక్షలకు  పెంచింది. విద్యార్థులకు పెరిగిన ఫీజులు కట్టాలని జులం చేస్తోంది. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పెరిగిన ఫీజులను తగ్గించాలంటూ ఐదు రోజుల నుండి కాలేజీ ఎదుట విద్యార్థులు నిరసనలు చేపట్టారు. వీరికి పలు విద్యార్ధి సంఘాలు సంఘీభావం తెలిపాయి.


సోమవారం ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నేతలు శంకర్పల్లిలో కాలేజీ బస్సులను రోడ్డుమీద ఆపేసి బైఠాయించారు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ఆందోళనలు తీవ్రతరం కానుండటంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.


మరోవైపు.. విద్యార్థి సంఘాలు సీబీఐటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, విద్యార్ధి నేతలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు వారికి అరెస్ట్ చేసి అక్కడికి నుండి తరలించారు. కాగా.. ఈ ఘటనతో  కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వారం పదిరోజులు సెలవు ప్రకటించింది.