TRS VS BJP:  తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా తగ్గిన వలసలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో కారు పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత దూకుడు పెంచిన గులాబీ బాస్.. గతంలో తనతో పని చేసి ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తిరిగి సొంత గూటికి రప్పిస్తున్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. కమలం పార్టీ కూడా కారు పార్టీకి ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను ఆకర్శించి కేసీఆర్ కు షాకిచ్చింది. బూర జంప్ తో అప్రమత్తమైన కేసీఆర్.. ఆపరేషన్ ఆకర్ష్ తో దూకుడు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ ను కారెక్కించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వామి గౌడ్, బూడిద బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ చేరికలతో గులాబీ పార్టీలో జోష్ పెరిగింది. దీంతో టీఆర్ఎస్ కు కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తోంది కమలదళం. టీఆర్ఎస్ లో కీలక నేతలకు వల వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆపరేషన్ లో భాగంగా ఓ ఎంపీతో బీజేపీ పెద్దలు మాట్లాడారని.. ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంత నియోజకవర్గం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తగా  ఉన్న రంజిత్ రెడ్డి.. ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్నారు. దీంతో రంజిత్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కమలం పార్టీ హైకమాండ్ స్కెచ్ వేసిందని అంటున్నారు.  బీజేపీ చేరిల కమిటి చైర్మెన్ గా ఉన్న ఈటల రాజేందర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో అతను బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ సాగుతోంది.


ఎంపీ రంజిత్ రెడ్డి కొన్నిరోజులుగా టీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉండటం కూడా ఆయన పార్టీ మారుతారనే  వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగిన  ఎంపీ.. ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ లీడర్లంతా ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో ఉన్నారు. తమకు కేటాయించిన గ్రామంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. 14 మంది మంత్రులు, 76 మంది ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మునుగోడు ఉపసమరంలో శ్రమిస్తున్నారు. కాని కేటీఆర్ తో గతంలో క్లోజ్ గా ఉన్న రంజిత్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలనే డిసైడ్ కావడం వలనే ఆయన మునుగోడు వెళ్లలేదనే టాక్ వస్తోంది. అంతేకాదు ఆయన వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటం వలనే.. అతనికి ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించలేదనే వాదన కూడా వస్తోంది.   


పార్టీ మారుతారనే వార్తలు వస్తున్న రంజిక్ రెడ్డికి సంబంధించి మరో అంశం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కమలం పార్టీలో ఆయన యాక్టివ్ గా ఉన్నారు. దీంతో రంజిత్ రెడ్డి బీజేపీలో చేరితే  కొండా పరిస్థితి ఏంటన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో రంజిత్ రెడ్డి.... రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నది ఆయన కోరికగా ఉందని తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే గత ఏడాదిగా ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ టికెట్ విషయంలో కమలం పార్టీ పెద్దల నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశం ఉంది. రాజేంద్రనగర్ బీజేపీ టికెట్ స్వామి గౌడ్ కు ఇవ్వనున్నారని గతంలో ప్రచారం జరిగింది. అయితే స్వామిగౌడ్ ఇటీవలే తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. రంజిత్ రెడ్డి చేరిక విషయం తెలిసే స్వామిగౌడ్ కారెక్కేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష్ తో దూకుదు పెంచిన సీఎం కేసీఆర్.. వలసలతోనే చెక్ పెట్టే యోచనలో కమలం నేతలు ఉన్నారంటున్నారు.


Read Also: Bigg Boss 6 Winner : గెలిచేది ఎవరు?.. జనాల అభిప్రాయమిదేనా?


Read Also: ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. బంగ్లాదేశ్ దిశగా దూసుకుపోతున్న సిత్రాంగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook