Palamuru - Rangareddy Lift Irrigation Project: ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇన్-టేక్ వద్ద స్విచ్ సీఎం కేసీఆర్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే భారీ పంపులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎత్తిపోతలకు సిద్ధమైంది అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 2 కిలో మీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు అదే ప్రాజెక్టు వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎత్తిపోతల ద్వారా వచ్చిన కృష్ణమ్మ జలాలను గ్రామ సర్పంచులు, ప్రజలు కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతీ గ్రామంలో ఆలయాల్లో అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి వారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం అని సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజలకు పిలుపునిచ్చారు.


పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రజలకు అందుబాటులోకి రావడాన్ని హర్షించదగిన రోజుగా అభివర్ణించిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. సెప్టెంబర్ 16వ తేదీ దక్షిణ తెలంగాణకు పండుగ రోజు అవుతుంది అని అభిప్రాయపడ్డారు. ఎన్నో మొక్కులు మొక్కితే,  దైవకృపతో, ఇంజనీర్ల కృషితో ఎన్నోఅడ్డంకులు అధిగమించిన తరువాతే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కల సాకారమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న కేసీఆర్.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలను పట్టుదలతో ఓ కొలిక్కి తేవడానికి కృషి చేసిన సీఎంఓ అధికారులకు, భారీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 



 


పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని.. ఇక బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ అధికారులు తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ( గతంలో ట్విటర్ ) ద్వారా ఓ ట్వీట్ చేశారు.