CM Revanth Reddy On TGPSC Group-1 Mains: గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్ 1 పరీక్షలు సోమవారం నుంచి యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. 95 శాతం మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని.. మరో శాతం మంది డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు నమ్మకండని కోరారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని.. కాలయాపనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని.. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 53 పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్‌కు 31 వేల మందిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశామన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యంతరంగా మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా.. అలా మారిస్తే కోర్టులు రద్దు చేస్తాయన్నారు. పోటీ పరీక్షలను నిత్యం వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. 


'తరచూ వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఆ పార్టీ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా..? పరీక్షల నిర్వహణను కోర్టులూ సమర్థించాయి. అభ్యర్థులు ఆందోళన విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా..' అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.


గ్రూప్‌-1 అభ్యర్థుల విషయంలో కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందని.. అయినా ప్రతిరోజు రోడ్డుమీదకు వచ్చి జనాలకు గ్రూప్‌-1 అభ్యర్థులు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. వాళ్లకు ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. గ్రూప్‌-1 పరీక్షలకు అంతా సిద్ధం చేశామని.. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ కొనసాగుతుందని తెలిపారు. ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అడ్డుకున్నా.. ఇబ్బందులకు గురిచేసినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు సాగుతాయని స్పష్టం చేశారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి పబ్లిక్‌కు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు.