CM Revanth Reddy: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
Jana Jatara Sabha in Chevella: పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము అల్లాటప్పగాళ్లం కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 14 స్థానాల్లో గెలిపించాలని కోరారు. చేవెళ్లలో జరిగిన జన జాతర సభలో ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Jana Jatara Sabha in Chevella: ప్రతి గ్రామంలో వివిధ సామాజికవర్గాలకు చెందిన అయిదుగురితో కలిపి ఇందిరమ్మ కమిటీలు వేస్తామని.. ఇళ్లు, పింఛన్లు, సిలెండర్లు, ఏ పథకమైనా ఆ కమిటీల ద్వారానే పేదలకు చేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గెలిచిన తర్వాత నాయకులు కార్యకర్తలను మర్చిపోతారనే ప్రచారం ఉందని.. తాము అలా కాదని పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎమ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీ సభ్యులగా, జడ్పీ అధ్యక్షులుగా గెలిపించుకునే వరకు అండగా నిలబడతామన్నారు. 75 రోజులుగా 18 గంటలు పని చేస్తున్నానని, ఒక్క రోజు సెలవు తీసుకోలేదని, సాధ్యమైనంత మేర కార్యకర్తలను కలిశానని తెలిపారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
Also Read: Dil Raju: పాలిటిక్స్ లోకి రాబోతున్న దిల్ రాజు.. నిజమెంత?
శాసనసభ ఎన్నికలకు ముందు తుక్కుగూడ సభలో సెప్టెంబరు 17న సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియమ్మ ఇచ్చిన మాటపై విశ్వాసంతో రాష్ట్రంలో ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాము 48 గంటల్లోనే ఆడ బిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.పది క్షలకు పెంచామన్నారు. మేడారం జాతరకు మహిళలు ఉచితంగా బస్సుల్లో వెళ్లారని అన్నారు.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడని.. తాను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని, కేటీఆర్‌కు చేతనయితే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. తాము అల్లాటప్పగాళ్లం కాదని.. అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చొలేదని చురకలంటించారు. ముఖ్యమంత్రి కుర్చీ తనకు ఈనాం కింద.. అయ్య పేరుతో రాలేదన్నారు. నల్లమల అడవి నుంచి తొక్కుక్కుంటూ తొక్కుకుంటూ వచ్చి కేటీఆర్ వంటి వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో తనను కార్యకర్తలు కూర్చొబెట్టారని.. ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నానంటే అది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, వారి పోరాట ఫలితమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలిచినంత కాలం, తనను భుజానమోసినంత కాలం కేటీఆర్, ఆయన తండ్రీ వచ్చినా ఈ కుర్చీని తాకలేరని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ఉంటే గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని, ఉన్న టీవీలన్నీ ఆయన చుట్టపోళ్లవేనన్నారు రేవంత్ రెడ్డి. తన తండ్రి చూపించడానికి తనకేమైనా టీవీ ఇచ్చాడా..? రాసుకోవడానికి పేపర్, సొల్లు వాగుడు వాగడానికి మైకులు ఇచ్చాడా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తలు కష్టపడితే నిలబడి కొట్లాడితే తమకు అధికారం వచ్చిందని, కేటీఆర్ చేసే తప్పులను తమ కార్యకర్తలు యూట్యూబ్‌లో పెట్టారన్నారు. తమకు ఆ ట్యూబ్, ఈ ట్యూబ్ ఏది అక్కరలేదని, కేటీఆర్ ట్యూబ్‌లైట్ పగలగొట్టే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.
దివాళా చెడిన కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అంటున్నాడని, కృష్ణానగర్‌లో ఏదైనా బ్రోకర్ దందా పెట్టకుంటే అదీ ఇదీ కలిస్తే ఆయన దందా బాగా నడిస్తుందన్నారు. వాళ్ల కుటుంబం దోచుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టారనే సంగతి కేటీఆర్‌కు గుర్తురావడం లేదని, చెరుకు తోటలు, పల్లీ చేలపై అడవిపందులు పడకుండా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకున్నట్లు, తెలంగాణను అడవి పందుల్లా తెగమెక్కుతుంటే తెలంగాణ ప్రజలు కరెంటు తీగలు పెట్టి వారిని బలి ఇచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి