Free Electricity and RS 500 Gas Cylinder: గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ లిమిట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే స్కీమ్స్‌ను అమలు చేశారు రేవంత్ రెడ్డి. తాజాగా మరో రెండు పథకాల అమలు చేసేందుకు నిర్ణయించారు. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ అమలుకు సంబంధించి విధి విధానాలపై మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చర్చించారు. 


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందజేసే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలా..? లేదా ఏజెన్సీలకు చెల్లించాలా..? అని చర్చించారు. ఇందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు మాత్రం రూ.500 చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చించాలన్నారు.


గృహ జ్యోతి స్కీమ్‌ను కూడా అనుమానాలు అపోహాలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ ఈ స్కీమ్‌ను వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి నుంచి  విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు.. అర్హులైన వారందరికీ గృహజ్యోతి స్కీమ్ కింద జీరో బిల్లులు జారీ చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.


ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. వాళ్లందరికీ సరిచేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలన్నారు. అన్ని గ్రామాల్లోనూ విద్యుత్ అధికారులు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. తప్పులను సరిదిద్దుకున్న వారందరికీ వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్ స్కీమ్ వర్తింజేయాలన్నారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.