వీడిన చిక్కుముడి ; అభ్యర్ధులను ఖరారు చేసిన కాంగ్రెస్
ఢిల్లీ సోనియా నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. మహాకూటమి నేపథ్యంలో మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన 26 స్థానాలను భాగస్వామ్య పార్టీలకు కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో టీడీపీకి -14, టీజేఎస్ -08, సీపీఐ -3 స్థానాలు, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
పెండింగ్ లో 20 స్థానాలు..
ఇదిలా ఉండగా మొత్తం 93 స్థానాలకు గాను 74 మంది అభ్యర్ధులను పేర్లను మాత్రమే కాంగ్రెస్ ఖరారు చేసింది. మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధల పేర్లను ఈ నెల 11 తర్వాత ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా వెల్లడించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగా ఉండటం, ఆయా స్థానాలను మిత్ర పక్షాల కూడా కోరుతున్న నేపథ్యంలో ఈ మేరకు 19 స్థానాలు పెండింగ్ ఉంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పెండింగ్ లో ఉంచడం పట్ల సీటు ఆశిస్తున్న ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జాప్యం చేస్తే తాము ప్రచారంలో వెనకబడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
టీజేఎస్, సీపీఐ ఒప్పుకునేనా ?
వాస్తవానికి మహాకూటమిలో భాగంగా టీజేఎస్ 12కి తగ్గకుండా సీట్లు కేటాయించాలని కోరితే.. సీీపీఐ ఐదుకు తగ్గకుండా సీట్లు కేటాయించాలని కోరింది. అయితే అందుకున్న భిన్నంగా టీజేఎస్ కు 8 సీట్లు, సీపీఐ 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై టీజేఎస్, సీపీఐ పార్టీలు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.