ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశాల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. రాష్ట్రంలో రైతులు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతోంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకునే దిశగా ఏ చర్యలు తీసుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ముగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఈ నిరసనల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గవర్నర్ నరసింహన్ వైపు తన హెడ్ సెట్‌ని విసిరారు. ఈ క్రమంలోనే ఆ హెడ్ సెట్ కాస్తా గవర్నర్‌కి పక్కనే వున్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కి తగిలింది. ఆ హెడ్ సెట్ స్వామి గౌడ్ కంటికి తగలడంతో వెంటనే స్వామిగౌడ్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఆయన్ని సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు.