టీడీపీతో తాము పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు రేపు హైదరాబాద్‌లో రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్‌లో ఉత్తమకుమార్‌రెడ్డి రేపు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తుపై రేపు ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పొత్తులపై చర్చలు జరిపేందుకు ఉత్తమకుమారరెడ్డికి టీటీడీపీ (తెలంగాణ తెలుగుదేశం పార్టీ) అధ్యక్షులు ఎల్.రమణ ఫోన్ చేసినట్లుగా కూడా పలు పత్రికలు వార్తలు రాశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ప్రస్తుతం ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను అన్నింటినీ ఒకే తాటి పైకి తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ కుటిల రాజకీయాల నుండి ప్రజలను కాపాడాలంటే.. టీడీపీతో పాటు అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 


ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని యోచిస్తున్న చంద్రబాబు.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రయోగం వర్కవుట్ అయితే ఏపీలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ క్రమంలో తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చంద్రబాబు భేటీ రాజకీయ శ్రేణుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు కేసీఆర్ ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే కనీసం డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. తెలంగాణలో టీడీపీకి 0.1 నుండి 0.2 శాతం వరకే ఓటు బ్యాంకు ఉందని.. అలాంటి పార్టీకి తెలంగాణ పౌరులు గులామ్ కాకూడదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.