Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడి! మూడు సభలు.. ఆరు గొడవలతో మునుగోడులో రచ్చరచ్చ
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఏకంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై దాడి జరిగింది. ప్రచారంలో భాగంగా రథంపై నుంచి కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా.. ఓ వ్యక్తి అతనిపైకి దూసుకువచ్చాడు. కోమటిరెడ్డి చేతిలోని మైకును లాగేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలింగ్ ఇంకా పది రోజుల సమయం ఉండగానే ఇలాంటి పరిస్థితి ఉంటే... ప్రచార గడువు ముగిసే సమయానికి ఏం జరుగుతుంది.. పోలింగ్ రోజున ఎలా ఉండనుందోనన్న ఆందోళన మునుగోడు జనాల్లో కనిపిస్తోంది.
జైకేసారంలోనే అంతకుముందు కూడా గొడవ జరిగింది. బీజేపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు. రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోటీగా బీజేపీ కార్యకర్తలు స్లోగన్స్ చేశారు. ఇరువర్గాలు ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి ఇరువర్గాలను చెదరగొట్టారు. తర్వాత తన ప్రచారం కొనసాగించారు కోమటిరెడ్డి. కొంత మందికి డబ్బులు ఇచ్చి తన సభల్లో అల్లర్లు చేయిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఫైరయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆదివారం ఉదయం కూడా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో గొడవ జరిగింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలు. గ్యాస్ సిలిండర్ ను చూపిస్తూ రాజగోపాల్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 18 వేల కాంట్రాక్టు కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల కేడర్ ను తరలించారు.
నాంపల్లి మండలంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తన కాన్వాయ్ పై బీజేపీ నేతలు దాడి చేశారంటూ నాంపల్లిలో పాల్వాయి స్రవంతి దర్నా చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం ఘర్షణలకు దిగారు. దీనిపై పాల్వాయి స్రవంతి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు
మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారంటూ బీజేపీ అభ్యర్థి ఫైరయ్యారు. ఆదివారం రాత్రి గట్టుప్పల్ లో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. ర్యాలీ ముగిశాకా నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ పయనమయ్యారు. అయితే కేటీఆర్ వస్తున్నాడంటూ చౌటుప్పల్ లో హైవే ని బ్లాక్ చేశారు పోలీసులు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ప్రచారం ముగించుకుని వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాహనాన్ని కూడా పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ కోసం నిలిపివేసిన ట్రాఫిక్ లో రెండు అంబులెన్సులు కూడా చిక్కుకుపోయాయి. దీంతో చౌటుప్పల్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైవేను ఎందుకు బ్లాక్ చేశారంటూ నిలదీశారు. కేటీఆర్ వస్తే ట్రాఫిక్ ఆపివేయడం ఏంటీ.. ఆయన ఏమైనా ముఖ్యమంత్రా అంటూ పోలీసులపై ఫైరయ్యారు. అంబులెన్సులు ఆపివేస్తారా అంటూ ఓ రేంజ్ లో ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు చౌటుప్పల్ పోలీసులు.
Read Also: Virat Kohli, Anushka Sharma: మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి