దళిత విద్యార్థులకు ఉన్నత చదువులు చేరువ చేయడం కోసం మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, గ్లోబల్ యూనివర్సిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేయాలని దళిత ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎంని కోరారు. గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన దళిత ఎమ్మెల్యేలు.. ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యం వున్న దళిత విద్యార్థులు పడుతున్న అవస్థలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు, గువ్వల బాలరాజు, బొడిగె శోభ, ఆరూరి రమేశ్, గ్యాదరి కిషోర్, మదన్‌లాల్, కే యాదయ్య ఉన్నారు.


ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై స్పందించిన సీఎం.. తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.