Delhi Liquor Scam: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచే ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్యాష్ డీలింగ్స్ ?
Delhi Liquor Scam: తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసే కొద్ది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చేపట్టిన దర్యాప్తు సంస్థలు ప్రముఖుల పేర్లతో పాటు వారికి కేసుతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేసేలా అత్యంత కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Delhi Liquor Scam Latest Updates: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు సంబంధం ఉందా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే అలా చేతులు మారిన నగదు బేగంపేట విమానాశ్రయం నుంచే ఢిల్లీకి ప్రైవేట్ చార్టెడ్ విమానాల ద్వారా వెళ్లినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖుల పేర్లు బట్టబయలు కాగా.. త్వరలోనే మరింత సంచలనం సృష్టించే వివరాలు వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది.
తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసే కొద్ది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చేపట్టిన దర్యాప్తు సంస్థలు ప్రముఖుల పేర్లతో పాటు వారికి కేసుతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేసేలా అత్యంత కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ సర్వీసులు అందిస్తున్న జెట్ సెట్‌గో సంస్థ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నేరుగా ప్రమేయం ఉన్న ప్రముఖులు ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ సర్వీసులు అందిస్తున్న జెట్ సెట్‌గో సంస్థ సేవలను ఉపయోగించుకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ జెట్ సెట్‌గో సంస్థ సీఈఓ మరెవరో కాదు.. విజయసాయి రెడ్డి అల్లుడి వదిన కనికా రెడ్డినే. కనికా రెడ్డి అంటే మరెవరో కాదు.. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ భార్యే ఈ కనికా రెడ్డి.
కనికా రెడ్డికి అభిషేక్ బోయినపల్లికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి ఇదే జెట్ సెట్‌గో సంస్థ సేవలు ఉపయోగించుకున్నట్టు తెలియడంతో ఈ సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల డేటాను సేకరించిన ఈడీ.. తాజాగా సంస్థ ప్రతినిధులను విచారించే పనిలో పడింది. బేగంపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండటం వంటి అంశాలను సొమ్ము చేసుకుంటూ వీఐపీలు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే నగదు తరలించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వీఐపీల వాహనాలను నేరుగా రన్‌వే పైకి తీసుకెళ్లే అవకాశం ఉండటంతో ఢిల్లీ స్కామ్ నిందితులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.
బేగంపేట ఎయిర్ పోర్టు కేంద్రంగానే భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్టు భావిస్తున్న ఈడి అధికారులు.. జెట్ సెట్ గో సంస్థ కార్యకలాపాల వివరాలు అందివ్వాలంటూ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి లేఖ రాశారు. జెట్ సెట్ గో సంస్థ అందించిన వివరాలను క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఈ సంస్థ ద్వారా చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని రాకపోకలు సాగించిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తూ పలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లకు సైతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తోంటే రానున్న కొద్ది రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈడి రాడార్లోకి రాకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.