Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..
Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్లో కొత్త జోష్ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..! బీజేపీలో ఇలా సడెన్‌గా మార్పుకు కారణాలేమిటి.. ?
Telangana BJP: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య గొడవలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్గుగా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించారు. హైడ్రాపై కూడా బీజేపీ నేతలు ఒక్కో సైడ్ తీసుకున్నారు. ఇన్నాళ్లు ఎవరిదారే వారిదే అన్నట్టు వ్యవహరించిన నేతలు హైకమాండ్ చొరవతో ఒక్కటైనట్టు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ చీఫ్ మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో నేతలంతా గ్రూపులుగా విడిపోయారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, పార్టీ సీనియర్లు ఇలా అనేక గ్రూపులు తయారయ్యాయి. ఈ పరిణామాలపై హైకమాండ్‌కు సైతం వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య పంచాయతీ బహిర్గత మైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైకమాండ్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అందుకే నేతలంతా తమ ఐక్యతను చాటేలా కీలక సమావేశం నిర్వహించారు. బీజేఎల్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఎంపీలు సైతం హాజరై రాష్ట్ర సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణలో రేవంత్ సర్కార్ వైఫల్యాలు, రుణమాఫీ అమలు, రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేపట్టాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ప్రస్తుత పరిణామాలపై అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ చాంబర్‌లో పార్టీ శాసనసభాపక్ష విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీ హాజరయ్యారు. బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, హరీశ్ బాబు, పాయల్ శంకర్, ధన్ పాల్, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి ఉన్నారు. నేతలంతా ఒకే వేదికపై కనిపించడంతో క్యాడర్ ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్లు గ్రూపులుగా విడిపోయిన నేతలు.. ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్దం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బీజేపీ నేతలంతా అత్యవసర సమావేశం నిర్వహించండంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మం వరదల సందర్భంగా పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ విషయంలోనూ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్ పదవి రేసులో చాలామంది నేతలు ఎవరికి వారే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేతల కలయిక వారి మధ్య ఐక్యతను చాటింది. తొలుత ఎల్పీ మీటింగ్ పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంపీలను సైతం ఆహ్వానించి ఎల్పీనేత మహేశ్వర రెడ్డి పార్టీ అంతా కలిసి కట్టుగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇదే తరహాలో నేతలంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలను గ్రౌండ్ లెవల్ లోనూ నిలదీస్తే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని కేడర్ అంచనా వేస్తోంది.
మరోవైపు సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీన్ని కాషాయ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయమై చర్చించిన బీజేపీ నేతలు విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావుడి చేస్తున్నారని, 2003 లోనే అక్రమ నిర్మాణాలపై గుజరాత్ లో సీఎం గా మోడీ పక్షపాతం లేకుండా అందరివీ కూల్చివేశారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. హైడ్రా మాత్రం ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉందన్నారు. తమకు సెక్యులర్ హైడ్రా కావాలని అరవింద్ డిమాండ్ చేశారు. రైతు రుణమాపీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తూర్పారా పట్టారు. అందరికి రుణమాఫీ చేయాలని సెప్టెంబర్ 20న ధర్నా చౌక్ లో దీక్ష చేయనున్నట్లు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వరద బాధితులు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని,.. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని సర్కారును హెచ్చరించారు.
మొత్తంగా రాష్ట్ర పార్టీ నేతలంతా ఒకే వేదిక మీదకు రావడం మాత్రం క్యాడర్‌కు కొత్త జోష్ నింపుతోంది. ఇదే పోరాటాన్ని రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తే పార్టీ మరింత విస్తరించడం పక్కా అనుకుంటున్నారట. ఇదే ఊపులో పార్టీకి కొత్త ప్రెసిడెంట్‌ను నియమిస్తే మరింత ఊపు ఖాయమని అనుకుంటున్నారట.. చూడాలి మరి ఈ ఐక్యత ఎన్నిరోజులు కంటిన్యూ అవుతుందో.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.