Car falls into Well: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబాన్ని ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. అన్నారం షరీఫ్ దర్గాను దర్శించుకున్న అనంతరం వారు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఈ కుటుంబం తమ సొంతూరికి వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు కేసముద్రం మండల కేంద్రం సమీపంలోని బై పాస్ రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి రహదారికి అనుకుని ఉన్న వ్యవసాయ బావిలో పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నారం షరీఫ్ దర్గాలో జరిగిన ఒక ఫంక్షన్ లో పాల్గొనేందుకు వెళ్లి వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. తొలుత ఐదుగురే ఫంక్షన్ కి బయల్దేరినప్పటికీ.. ఫంక్షన్ జరిగిన చోటు నుంచి మరో ఇద్దరికి లిఫ్ట్ ఇవ్వడంతో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులం అయ్యామని కారు ప్రమాదానికి సంబంధించిన బాధితులలో ఒకరు తెలిపారు. 


నెల రోజుల వ్యవధిలో ఇలా కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిన ఘటన ఇది రెండొది. గత నెలలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జాప్తి నాచారం వద్ద సైతం ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 


అంతకంటే ముందు జులై నెలాఖర్లోనూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులోనూ ఇదే తరహాలో కారు బావిలో పడిన ఘటనలో ఒక రిటైర్డ్ ఎస్సై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. కారు బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బుద్ధయ్య నాయక్ సొంత కుటుంబంలోనే ఈ కారు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఎందుకంటే కారులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ మరెవరో కాదు.. బుద్ధయ్య నాయక్ సొంత సోదరుడే కావడం అతడిని ఘటనా స్థలంలోనే కోలుకోలేని షాక్‌కి గురయ్యేలా చేసింది.