ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ గిరిజన పాఠశాలలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న జోసెఫ్‌కి, అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థికి మధ్య తలెత్తిన ఘర్షణలో 4వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. తోటి విద్యార్థుల ద్వారా 4వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్.. జరిగిన ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాలుడి మృతిపై దర్యాప్తు చేపట్టారు. 


పోలీసులు అందించిన సమాచారంతో పాఠశాలకు చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు అక్కడ తమ కొడుకు నిర్జీవంగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరయ్యారు. పాఠశాలలో బాలుడి మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని పాఠశాల ఎదుట సిబ్బందికి వ్యతిరేకందా ఆందోళన చేపట్టాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థుల మధ్య అంత తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతుంటే పాఠశాల సిబ్బంది ఏం చేస్తున్నారని బాలుడి తల్లిదండ్రుల తరపు బంధువులు, విద్యార్థి సంఘాలు నిలదీయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి.