హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ సై అంటూ సంకేతాలు ఇచ్చారు. ప్రజలు ఆశ్వీర్వదిస్తే ఏకంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి పోటీ తన సత్తా చూపుతానన్నారు. సచివలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను  కలిసిన గద్దర్.. ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రకు అనుమతివ్వాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని గద్దర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు.ఇటీవలే గజ్వేల్నియోజకవర్గంలో పర్యటించిన గద్దర్...ఇదే నియోజకవర్గం నుంచి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే అంశాన్ని గద్దర్ ఇలా బయటపెట్టడం గమనార్హం.


కేసీఆర్ పాలనలో సంతోషం కరువు
ఈ సందర్భంగా  కేసీఆర్ పాలనపై గద్దర్  విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. బడుగుబలహీన వర్గాలు, అణగారిన వర్గాలు సంఘటితమై హక్కుల సాదన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు వచ్చాయా ? అంటూ ప్రశ్నించారు. ఇవే అంశాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని గద్దర్ ప్రకటించారు.