రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌తో పాటు రెండవ నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అతడి పనిమనిషి పార్వతి ప్రస్తుతం గృహ నిర్భందంలో వుంది. ఈ కేసులో గజల్ శ్రీనివాస్ తర్వాత మళ్లీ అంతటి కీలక వ్యక్తి అయిన పార్వతి మీడియా ముందుకొస్తే, కీలకమైన అంశాలు ఏమైనా వెలుగుచూసే ప్రమాదం వుందనే కారణంతోనే అతడి కుటుంబసభ్యులు ఆమెని తమ ఇంట్లోనే గృహ నిర్భందంలో పెట్టినట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో జుడీషియల్ రిమాండ్‌లో వున్నాడు. నాంపల్లి కోర్టు అతడికి జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సైతం ఇవాళ కోర్టులో విచారణకు రానుంది. 


అయితే, గజల్ శ్రీనివాస్ బెయిల్‌పై బయటికొస్తే, అతడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సేవ్ టెంపుల్ సంస్థ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీ అదృశ్యం అవడంతోపాటు బాధితురాలిపై బెదిరింపులకి పాల్పడటం, సాక్ష్యాధారాలు సైతం తారుమారు చేసే ప్రమాదం వుందని పంజాగుట్ట పోలీసులు నిన్ననే కోర్టుకి విన్నవించారు. ఈ నేపథ్యంలో నేడు గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోనుందా అనే తెలియాల్సి వుంది. 


ఇక ఈ కేసులో రెండవ నిందితురాలిగా వున్న పార్వతిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం అని నిన్ననే పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టంచేశారు. దీంతో ఏ క్షణమైనా ఆమెని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గజల్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది.