హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం దిశగా దశలవారీగా చర్యలు తీసుకుంటూ స్వచ్చ హైదరాబాద్ స్థాపన కోసం కృషిచేస్తోన్న జీహెచ్ఎంసి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పూల బొకేల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. శుభకార్యాలు, వేడుకలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో పూల బొకేలతో అభినందించుకోవడం చాలా కాలంగా ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే, పూల బొకే తయారీలో వినియోగిస్తోన్న 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్ల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నందని గ్రహించిన జీహెచ్ఎంసీ.. అంతిమంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై శుక్రవారం ఫ్లోరిస్ట్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జీహెచ్ఎంసి.. బొకేల తయారీలో ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా అందమైన వస్త్రాలు, పేపర్‌ లేదా జనపనార వంటి బయోడిగ్రేడబుల్‌ కవర్లు వినియోగించాలని వారిని ఆదేశించారు. పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు రూపొందించి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం అనంతరం ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకురానున్నామని చెప్పిన కమిషనర్ దానకిషోర్... నిషేధిత ప్లాస్టిక్‌ కాకుండా వస్త్రాలు, పేపర్‌ లేదా జనపనార వంటి బయోడిగ్రేడబుల్‌ సామాగ్రి వినియోగించే ఫ్లోరిస్టులకు భవిష్యత్తులో ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నట్టు స్పష్టంచేశారు. 


నగరంలో చిరు వ్యాపారుల నుంచి మొదలుకుని, బడా వ్యాపారుల వరకు దాదాపు 500 వరకు ఫ్లోరిస్టులు ఉన్నారు. వీళ్లంతా ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికితే, ప్లాస్టిక్ నిషేధం దిశగా జీహెచ్ఎంసి చేసిన మరో ప్రయత్నం విజయవంతమైనట్టే.