తెలంగాణలో ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి జరిగే అతి పెద్ద గిరిజన సంబురం మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపునివ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎంపీ సీతారామ్ నాయక్ లోక్‌సభలో కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర (మేడారం జాతర) అతి పెద్ద మహోత్సవమని.. 12వ శతాబ్దం నుండే గిరిజనులు, ఆదివాసీలు ఈ పండగను రంగరంగ వైభవంగా రాష్ట్రంలో చేస్తున్నారని ఆయన తెలిపారు.


ప్రతీ రెండేళ్లకు ఒక్కసారి కోట్లాదిమంది హాజరయ్యే ఈ జాతరకు జాతీయ పండుగ గుర్తింపునివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తిస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి దేవతలను దర్శించుకుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.