జూనియర్ కాలేజీలుగా గురుకులాలు
గురుకుల విద్యాసంస్థ పరిధిలోని స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా మార్చాలని టీ-సర్కార్ నిర్ణయించింది.
హైదరాబాదు: 'కేజీ టు పీజీ' పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. తెలంగాణ గురుకుల విద్యాసంస్థ పరిధిలోని స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో 35 పాఠశాలలు ఉండగా.. 2017-18 విద్యా సంవత్సరంలో ఆరు స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో ఇప్పటికే ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించింది. మిగతా 29 స్కూళ్లను కూడా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ పాఠశాలల్లో డిమాండ్ మేరకు మౌలిక వసతులు కల్పించి కళాశాలలుగా మార్చనుంది. ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ విధానంలో 10వ తరగతి వరకు నిర్వహిస్తోంది. తాజా నిర్ణయంతో 2018-19 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీతో పాటు ఎంఈసీ కోర్సులను ప్రారంభించనుంది. విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్.ఆచార్య త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.