హైద్రాబాద్ : నగరంలో హవాలా సొమ్ము తరలించే ముఠా గట్టురట్టైంది. ఈ మేరకు నలుగురు నిందితులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 7.7 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం నిందితులు ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి నగదును తీసుకొస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతరాత్రి ఏసీగార్డ్స్‌లో పలు చోట్ల పోలీసులు సోదాలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్‌ జోన్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌‌లో ఈ నగదు పట్టుబడింది. కాగా ఈ కేసులో పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.


రాజకీయ నేతలపై అనుమానం
ఇంత భారీ మొత్తంలో పట్టుబడ్డ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు?  ఎవరు పంపారు ? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఉన్న వ్యక్తులెవరు? అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. కాగా ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు సంబంధిత పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగదు పంచేందుకు ఈ నగదు తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే వాస్తవాలు పోలీసుల విచారణలో తేలనుంది.